
బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమాయణం నడిచిందనే ప్రచారానికి ఎట్టకేలకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తెరదించాడు. చాలా ఏళ్లుగా వస్తున్న ఆ ఊహాగానాలపై స్పందించిన అతడు.. తమ మధ్య ఉన్నది స్నేహమేనని స్పష్టం చేశాడు. ప్రీతిపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రీతి జింటా యజమానిగా ఉన్న రోజుల్లో తాము దగ్గరగా కనిపించడంతో ఎన్నో కథనాలు వచ్చాయని బ్రెట్ లీ గుర్తు చేసుకున్నాడు. తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రచారంపై నేరుగా స్పందించాడు.
‘‘నేను ఎప్పుడూ ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి ఎప్పుడూ నా మంచి స్నేహితురాలే. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. ఆమె చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి ప్రచారాలు నన్నెప్పుడూ ప్రభావితం చేయలేదు. నిజం నాకు తెలుసు. ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోలేదు’’ అని బ్రెట్ లీ చెప్పాడు. 2008 నుంచి 2011 మధ్య పంజాబ్ కింగ్స్‌కు బ్రెట్ లీ ఆడిన సమయంలో ఈ ప్రచారం ఎక్కువైంది. ముంబైలో ఓ రెస్టారెంట్ వద్ద ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత ప్రేమలో ఉన్నారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి.!!

