చివరగా థియేటర్లలో నడిచిన ‘వకీల్ సాబ్’ అంచనాలకు తగ్గట్లే మంచి విజయం అందుకొని రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వచ్చింది. ఇక ఈ ఏడాది పెట్టుబడి-రాబడి పరంగా బిగ్గెస్ట్ హిట్ అంటే ‘జాతిరత్నాలు’నే. ఈ చిత్రం రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని కంటే ముందు వచ్చిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’ కూడా అసాధారణ విజయం అందుకుంది. కొత్త హీరో హీరోయిన్లతో నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
డెబ్యూ హీరో సినిమాల్లో కొత్త రికార్డులను నెలకొల్పింది ‘ఉప్పెన’. ఇక సంక్రాంతికి వచ్చిన రవితేజ చిత్రం ‘క్రాక్’ కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న సమయంలోనే ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికే వచ్చిన ‘రెడ్’ కూడా హిట్ స్టేటస్ అందుకోగా.. చిన్న సినిమాలు నాంది, జాంబి రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం కూడా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు అందించాయి. వైల్డ్ డాగ్, రంగ్ దె, శ్రీకారం చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. అరణ్య, అల్లుడు అదుర్స్, మోసగాళ్లు, చెక్, చావు కబురు చల్లగా, కపటధారి లాంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి.