నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్ మహాసముద్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కాగా.. ఇప్పుడు సిద్దార్ధ్ కు ఓ చేదు అనుభవం ఎదురైందట. తనకు నిత్యం వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
దీనిపై తన గళాన్ని వినిపిస్తున్న సిద్దార్ధ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే పలుమార్పు సిద్దార్ధ్ విమర్శలకు తమిళనాడు బీజేపీ నేతలు కౌంటర్లు వినిపించారు. కాగా ఇప్పుడు బీజేపీ నేతలే తన ఫోన్ నెంబర్ కావాలని లీక్ చేసి రాంగ్ కాల్స్ చేసి తిడుతున్నారని ఆరోపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన సిద్దార్ధ్ తనకు 500 పైగా నంబర్స్ నుండి కాల్స్ చేసి తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని తిడుతూ బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.