టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తన పట్ల ఓ ప్రముక విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది ఒకరు అవమానకరంగా ప్రవర్తించారని ట్విటర్ వేదికగా తెలియజేసింది. “ఇండిగో6ఈ సిబ్బంది ఈ రోజు మా పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించారు. మా విమానంలో విపుల్ నకాషే అనే సిబ్బంది ఈ రోజు మాతో అనుచితంగా వ్యవహరించారు. అహంకారంగా మాట్లాడటమే కాకుండా తిర్సకరణ తీరుతో బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. .
సాధారణంగా నేను ఇలాంటి విషయాల గురించి పట్టించుకోను. ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది.” అని పూజా హెగ్డే ట్విటర్లో పేర్కొంది..ప్రస్తుతం పూజ చేసిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు, అభిమానులు కూడా ఆమెకు అనుకూలంగా పోస్టు పెడుతున్నారు. ఓ సెలబ్రెటీ పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని ట్వీట్ చేస్తున్నారు. పూజాకు జరిగిన ఈ అనుభవం పట్ల సదరు విమాన సంస్థ స్పందించింది. ఆమెకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. “మిసెస్ పూజా మీకు జరిగిన అవమానానికి క్షమించమని అడుగుతున్నాయి. మేము వెంటనే ఈ విషయంపై మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మీ మొబైల్ నెంబర్‌తో కూడిన పీఎన్ఆర్ నెంబర్‌ను మాకు షేర్ చేయండి” అని ఇండిగో సంస్థ ప్రతిస్పందించింది.