
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ‘విరూపాక్ష’తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టరీ, పురాణ ఇతిహాసాలు, అడ్వెంచర్ అంశాలను మేళవించి సరికొత్త నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచగా.. తాజాగా వచ్చిన ట్రైలర్అంచనాలను మరింత పెంచేసింది. ఇందులోని సన్నివేశాల ద్వారా సినిమా కథా ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై చిత్రబృందం కొంత స్పష్టత ఇచ్చింది. ట్రైలర్‌ను గమనిస్తే దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి చరిత్రకు సంబంధించిన ఎన్నో అంతుచిక్కని విషయాలు ఇందులో ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పురాతన కట్టడాలు, వింతైన సంకేతాలు, కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాల నేపథ్యంలో కథ నడవనుంది.
తొలుత ఒక నిధి అన్వేషణగా ప్రారంభమైన ప్రయాణం క్రమంగా ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. చివరకు ప్రపంచానికే ముప్పుగా పరిణమించే ఒక ప్రాచీన శక్తి గురించి ఇందులో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. వేదాలకు సంబంధించిన విజ్ఞానం, అతీంద్రియ శక్తులు, వేల సంవత్సరాలుగా మరుగునపడిన రహస్యాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. సృష్టి నియమాలను పరిరక్షించడానికి ఒక దైవిక శక్తి ఎంచుకున్న వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ సూచిస్తోంది. అసలు నాగచైతన్యకు అప్పగించిన కర్తవ్యం ఏమిటి? ఒక సాధారణ వ్యక్తి నుంచి వృషకర్మగా ఆయన ఎలా మారతారు? పురాతన కాలం నుంచి దాగి ఉన్న రహస్యాల వెనుక ఉన్న అసలు కారణమేంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా చైతన్య కొత్త లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
‘విరూపాక్ష’తో హారర్ థ్రిల్లర్ జానర్లో విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈసారి పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. భారీ నిర్మాణ విలువలు, గ్రాండ్ విజువల్స్, ఉత్కంఠను కలిగించే సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ రెండో సీజన్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సీజన్ మంచి ఆదరణ పొందడంతో సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి రెండో సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నాగచైతన్య తన కెరీర్లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు..!!

