
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. విభిన్నమైన కథలు, సహజమైన పాత్రలు, వినూత్నమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన ప్రత్యేక శైలి ఉంటుంది. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్.. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే కొంతకాలంగా దర్శకత్వం కంటే నటనపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఆయన.. ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'ENE Repeat'తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకలో తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తనను చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారని, తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
ఇప్పటివరకు డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చెబుతూ వచ్చానని, కానీ ఇకపై ఆలోచనా విధానాన్ని మార్చుకోబోతున్నానని పేర్కొన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూనే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించడంపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తన సినిమాలు కేవలం పట్టణ ప్రాంతాల ప్రేక్షకులకే పరిమితం కాకుండా ఏ, బీ, సీ సెంటర్లలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన సినిమాల ద్వారా మరింత విస్తృతమైన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఇకపై తన మాటలతోనే కాకుండా సినిమాలతోనూ తన సత్తా ఏంటో నిరూపిస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తరుణ్ భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రతిభను ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తిస్తూనే ఉన్నారని, 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఆయన ఆశించిన స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఆయన నటుడిగా చేసిన కొన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో తిరిగి దర్శకుడిగా తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక 'ENE Repeat' విషయానికి వస్తే.. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఈ నగరానికి ఏమైందిdir' సినిమాలోని పాత స్నేహితుల బృందాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సినిమాలో కాలేజీ కుర్రాళ్లుగా కనిపించిన ఈ స్నేహితులు..సీక్వెల్‌లో జీవితంలో మరింత పరిణతి చెందిన వ్యక్తులుగా కనిపిస్తారు. కామెడీతో పాటు స్నేహం, వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు తరుణ్ భాస్కర్ వెల్లడించారు..!!
