ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ చిత్రం కారణంగా దేశవ్యాప్తంగా లవ్ జీహాద్ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. కొన్ని స్టేట్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే నిషేధం విధించారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా చెబుతూ.. ఇందులో ముస్లింలను అగౌరవ పరిచేలా ఏం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ పై పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వారికి ఆమె కూడా ధీటుగానే సమాధానమిస్తున్నారు. లవ్ జీహాద్ అంశంపై ఆమెను టార్గెట్ చేస్తున్న వారికి ఖుష్బూ స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చారు..
‘వివాహం కోసం నేను మతం మారినట్టు జోరుగా ప్రచారం చేసేవారు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోండి. మన దేశంలోని వివాహ చట్టం గురించి కచ్చితంగా వారికి తెలిసివుండదు. పెళ్ళి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదు. మతం మారాలని ఎవరూ నాపై ఒత్తిడి చేయలేదు. నా 23 ఏళ్ల వైవాహిక జీవితం గౌరవం, నమ్మకం, సమానత్వం, ప్రేమకు ప్రతీకగా ఉంది’ అని పేర్కొన్నారు. ఖుష్బూ కోలీవుడ్ దర్శకుడైన సుందర్ సి. ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ముస్లిం మతానికి చెందిన ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు..!!