టాలీవుడ్ జనాలంతా కరోనా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. దానిపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. అందుకే ఒక్కొక్కరుగా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. కాస్త ముందుజాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదనేది అందరి ఉమ్మడి అభిప్రాయం. ఇప్పుడీ లిస్ట్ లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, తను మాత్రం షూటింగ్ కు రెడీ అని ప్రకటించింది ఈ చిన్నది.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ప్రభాస్ తో చేస్తున్న రాధేశ్యామ్ సినిమా ఉంది. మరోవైపు అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్ పైకి వచ్చినా కాల్షీట్లు కేటాయించడానికి, షూటింగ్ కు రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ప్రస్తుతం పూజా హెగ్డే బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఈ క్షణం వరకు ఆమె బయటకు రాలేదు. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు షూటింగ్స్ చేయడానికి తను మానసికంగా, శారీరంగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.