ప్రతి రోజు అద్భుతాల్ని ఆశించవొద్దని, ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ఎన్నో జీవిత సత్యాల్ని తెలుసుకోవచ్చని తాత్వికధోరణిలో వ్యాఖ్యానించింది గోవా భామ ఇలియానా. నిత్యం వ్యాయామాలు చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఒక్కోసారి త్వరగా ఎందుకు అలసిపోతున్నానో అర్థం కావడం లేదని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు ఓ పోస్ట్ చేసింది. ‘కొద్దిరోజులుగా వర్కవుట్స్ చేయాలంటే బద్దకంగా అనిపిస్తోంది. ఏదో తెలియని నిస్సహాయత ఆవరించిన భావన కలుగుతోంది. ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే నా శరీరానికి, మనసుకు విశ్రాంతి కావాలనిపిస్తోంది.
ప్రతి రోజు మనం కోరుకున్న విధంగా ఉండదు. అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడే జీవితాన్ని తరచిచూస్తాం. మనకు ఏం కావాలో తెలుసుకుంటాం. ప్రస్తుతం నేను ఆ అన్వేషణలోనే ఉన్నా. నాతో నేను సంభాషించుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటున్నా’ అని ఇలియానా పేర్కొంది. దీంతో ఈ సొగసరి ఆరోగ్యం గురించి అభిమానులు ఆరాతీస్తున్నారు. అయితేతానుసంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని చెబుతోంది ఇలియానా.