
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా గ్లామరస్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ, ఇప్పుడు తనలోని నటనను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'భోగి' సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు సంపత్ నంది హీరోయిన్ డింపుల్ హయాతికి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ సంపత్ నంది ఎందుకు క్షమాపణలు చెప్పారంటే.. డింపుల్ హయాతిని ఎలాంటి స్కిన్ షో లేకుండా, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్ ఉపయోగించకుండా ఒక ప్రత్యేకమైన పాటలో చూపిస్తానని గతంలో ఆమెకు మాట ఇచ్చారట.
ముఖ్యంగా రాజ్ కపూర్ సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా, హుందాగా చూపించేవారో అదే తరహాలో డింపుల్‌ను తెరపై ఆవిష్కరించాలని అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 'భోగి' సినిమాలో ఆ హామీని నెరవేర్చలేకపోయానని సంపత్ నంది వెల్లడించారు. అందుకే వేదికపైనే ఆమెకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా తమ కాంబినేషన్‌లో వచ్చే తదుపరి సినిమాలో తప్పకుండా అలాంటి పాటను రూపొందిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన డింపుల్ హయాతి కూడా దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు చాలామంది తనను గ్లామర్ కోణంలోనే చూశారని, కానీ తన శరీరాన్ని కాకుండా కళ్లలోని భావాలను, నటనను గుర్తించిన దర్శకుడు సంపత్ నంది అని ఆమె పేర్కొన్నారు. తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
'భోగి' సినిమాలో మందారం అనే కీలకమైన పాత్రలో కనిపించనున్న డింపుల్, ఈ చిత్రంలో ఒక్క డ్యాన్స్ నంబర్ కూడా లేదని, తనలోని కొత్త నటిని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ 27, 2026న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు డింపుల్ హయాతి గతంలో 'గల్ఫ్', 'గద్దలకొండ గణేష్', 'ఖిలాడి', 'రామబాణం' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'జర్ర జర్ర' పాట ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇటీవల 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టులతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు 'భోగి' సినిమాతో నటిగా మరో మెట్టు ఎక్కుతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..!!
