in

Prabhas extended his support to the ‘Nasha Mukt Bharat’ campaign!

Prabhas extendeds his support to the 'Nasha Mukt Bharat' campaign!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ తనవంతు బాధ్యతను నిర్వర్తించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఆయన దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'నషా ముక్త్ భారత్' ప్రచారానికి తన మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రభాస్‌ను కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఇందుకు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఈ ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక టీ షర్ట్స్‌ను ఆవిష్కరించారు. ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం డ్రగ్స్ సమస్య సమాజంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని..

యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా హీరోలకు, సెలబ్రిటీలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారని, ముఖ్యంగా యువతపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ద్వారా మరింత మందికి ఈ సందేశాన్ని చేరవేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ చర్యలతోనే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాదని, ప్రముఖులు, సామాజిక సంస్థలు, ప్రజలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక ఈ ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమం నవంబర్ 25, 26, 27 తేదీల్లో జరగనుంది.

అంబర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఈ అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఐటీ సంస్థలు ఇలా అన్ని రంగాల్లోనూ డ్రగ్స్‌పై అవగాహన పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ', నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి. ముఖ్యంగా తన సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్, ఇప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Full details: Fauzi – story, cast, box office and OTT

Telugu movie theatres in Singapore: cinemas in Singapore and Malaysia that show Telugu films

Telugu Movie Theatres in Singapore and Malaysia: Full List