బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎంతో ప్రేమగా ముంబైలో నిర్మించుకున్న ‘ప్రతీక్ష’ బంగ్లాను .. బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కూల్చేయబోతున్నట్టు సమాచారం. ప్రతీక్ష బంగ్లా ఎంతో అందంగా ఉంటుంది. ఓ చారిత్రక కట్టడాన్ని తలపిస్తుంది. కేవలం ఈ ఇంటిని చూసేందుకు కూడా ముంబై వెళ్లే వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఈ బంగ్లా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ..
రోడ్డు విస్తరణలో భాగంగా ఈ బంగ్లాను కూల్చేయాలని బీఎంసీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రతీక్ష బంగ్లా ఓ అక్రమ కట్టడం అంటూ కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాడు. ‘2017లో రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసింది. కానీ ఆ నోటీసులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ భవనం ఓ సామాన్యుడిది అయి ఉంటే బీఎంసీ ఇలాగే వ్యవహరించి ఉండేదా’ అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.