
నటి కీర్తి సురేష్ కు ప్రముఖ దర్శకుడు మిస్కిన్‌కు మధ్య ఉన్న అనుబంధంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ‘డోరోతి’ సినిమాలో కీర్తి సురేష్ నటనను ప్రశంసించిన దర్శకుడు మిస్కిన్.. ఆమెను అభినందించే సమయంలో తన చేతిని కీర్తి తొడపై ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిస్కిన్ అలా చేయడం పట్ల కీర్తి అసౌకర్యంగా ఫీలైనట్లు కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు మాత్రం బహిరంగ వేదికపై ప్రముఖులు ఎలా ప్రవర్తించాలనే విషయంపై దర్శకుడిని విమర్శించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు కీర్తి సురేష్ స్వయంగా స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ నెటిజన్ తన పోస్టును తొలగించాల్సి వచ్చింది.
ఈ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్..మిస్కిన్‌తో తనకున్న అనుబంధాన్ని స్పష్టం చేస్తూ నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. “మొదటగా, నా ముఖంలో అసౌకర్యం కనిపిస్తోందని మీకు ఎక్కడ అనిపించింది? ఆయనతో పాటు నేను కూడా తండ్రీకూతుళ్లలాంటి అనుబంధం ఉందని చెప్పడం మీరు వినలేదా? రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ నేను అసౌకర్యంగా ఫీలయ్యానని అనుకున్నా, సినిమాల్లో మేము ఇతరులను తాకుతుంటాం కాబట్టి బయట కూడా అలాంటి స్పర్శకు సౌకర్యంగా ఉండాలని మీరు భావిస్తున్నారా? ఇలాంటి విషయాల్లో మీరు కొన్ని అంశాలను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్రదర్” అంటూ ఆమె ఘాటుగా బదులిచ్చారు.
సినిమాల్లో నటించే విధానాన్ని, వ్యక్తిగత జీవితంలోని పరిస్థితులను ఒకేలా చూడకూడదని తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యంగా మిస్కిన్‌తో తనకు తండ్రీకూతుళ్ల తరహా అనుబంధం ఉందని కీర్తి గుర్తుచేశారు. అయితే ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమె స్పష్టత ఇచ్చినప్పటికీ, ఈ వీడియో మాత్రం నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. మరోవైపు కీర్తి సురేష్ నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించారు. ఇందులో భవానీ అనే శక్తివంతమైన మహిళ పాత్రలో కీర్తి కనిపించగా, రాధికా ఆప్టే రుద్ర పాత్రను పోషించారు. మహిళల ఆధిపత్యం, అధికారం, ప్రతీకారం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాలో కీర్తి లతారెడ్డి పాత్రలో కనిపించనున్నారు..!!

