
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టవద్దని, వ్యక్తిగత హద్దులను దాటవద్దని యువ నటీనటులకు సీనియర్ నటి కాజల్ అగర్వాల్ హితవు పలికారు. తన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలోని అనుభవాలను పంచుకున్నారు. “అవకాశాల కోసం ప్రతిదానికీ ‘యస్’ చెప్పాల్సిన అవసరం లేదు. మనకు నచ్చని లేదా అసౌకర్యంగా అనిపించే విషయాలకు ధైర్యంగా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి” అని కాజల్ స్పష్టం చేశారు..
తన కెరీర్‌లోనూ ఇబ్బందికరంగా అనిపించిన బికినీ సన్నివేశాలను, శృతిమించిన శృంగార దృశ్యాలను తిరస్కరించానని..వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రధానమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా యువ నటీనటులు విపరీతమైన ఒత్తిడిని, అవాస్తవిక సౌందర్య ప్రమాణాలను ఎదుర్కొంటున్నారని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. “వారిని చూస్తుంటే బాధగా ఉంది. ఈ ఒత్తిళ్లను తట్టుకుని వారు పరిశ్రమలో నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు..!!

