అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు అయిన టాలీవుడ్ హీరో సుమంత్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది సోషల్ మీడియాలో. అతను ఒకప్పుడు ‘తొలి ప్రేమ’ కథానాయిక కీర్తి రెడ్డిని పెళ్లాడటం.. కొన్నేళ్ల తర్వాత వాళ్లిద్దరూ విడిపోవడం తెలిసిందే. దాదాపు దశాబ్దంన్నరగా సుమంత్ ఒంటరిగా ఉంటున్నాడు. అతడి తీరు చూస్తే ఇక మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేనట్లే కనిపించింది. కానీ ఇప్పుడు అతను మళ్లీ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.
పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ పెళ్లాడనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అంటూ ఇద్దరి పేర్లున్న వెడ్డింగ్ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇది సుమంత్ పెళ్లి కార్డే అని.. రెండో పెళ్లి కావడంతో పెద్దగా హడావుడి లేకుండా ఈ తంతును ముగించాలని సుమంత్ చూస్తున్నాడని.. అందుకే దీని గురించి అధికారిక ప్రకటనలేవీ లేవని అంటున్నారు. ఒక పెళ్లి విఫలమయ్యాక నడి వయసులో పెళ్లాడటానికి చాలామంది సందేహించట్లేదు ఇప్పుడు.
ఎంత ఆస్తి ఉన్నా..కుటుంబ సభ్యుల ప్రేమ దక్కుతున్నా.. ఒక వయసు దాటాక జీవిత భాగస్వామి లేని లోటు ఎవరికైనా తెలుస్తుంది. ఒంటరితనం వేధిస్తుంది. అందుకే ఇప్పటి సమాజంలో లేటు వయసులో రెండో పెళ్లిళ్లు మామూలే. సినీ రంగంలోనూ ఇది సాధారణమే. గత ఏడాది సింగర్ సునీత.. రామ్ అనే మీడియా వ్యక్తిని పెళ్లాడటం తెలిసిందే. ఈ కోవలోనే సుమంత్ కూడా నిజంగా రెండో పెళ్లి చేసుకుంటుంటే ఆశ్చర్యమేమీ లేదు.