
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ధర్మన్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, దర్శకుడు అశ్వత్ మారిముత్తు సోషల్ మీడియా వేదికగా ఆమెకు స్వాగతం పలికారు. దీంతో రజనీ-నయన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆదివారం సాయంత్రం ‘ధర్మన్’ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తమ సోషల్ మీడియా ఖాతాలో “కొన్ని కళ్లు అన్నీ చెప్పేస్తాయి. ఆ తేజస్సు రాబోతోంది” అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొద్ది గంటలకే దర్శకుడు అశ్వత్ మారిముత్తు స్పందిస్తూ, నయనతారను ట్యాగ్ చేసి “మా టీమ్‌లోకి స్వాగతం మేమ్” అని పోస్ట్ చేయడంతో ఈ వార్త ఖరారైంది. రజినీకాంత్, నయనతార కాంబినేషన్ వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమే. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ‘చంద్రముఖి’, ‘కుచేలన్’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’ వీరి కాంబినేషన్లో రాబోతున్న ఐదో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి..!!

