ప్రస్తుతం బాలీవుడ్‌లో అందరి దృష్టి రాహుల్-అతియా శెట్టి మీదే ఉంది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట వివాహం ఎప్పుడు చేసుకుంటారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఈ సంవత్సరం చివర్లోనే ఒక్కటవనుందని తెలుస్తోంది. సునీల్ శెట్టి ముద్దుల తనయ అయిన అతియా, కేఎల్ రాహుల్‌తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉంది. తాజాగా ఈ జంట ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్ రెంటుకు తీసుకుని కలిసి ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
వీరిద్దరూ ఇప్పటికే సముద్ర తీరం కనిపించే విధంగా ఉన్న 4-బెడ్రూం అపార్ట్‌మెంట్‌ను రెంట్‌కు తీసుకుందని తెలుస్తోంది. బాంద్రాలోని కార్టర్ రోడ్ అపార్ట్‌మెంట్‌లో వీరు ఫ్లాటును అద్దెకు తీసుకున్నారట. నెలకు అద్దె వచ్చేసి 10 లక్షలపైనే ఉంటుందని సమాచారం. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటోంది. ఇటీవలే కేఎల్ రాహుల్ తన 30వ పుట్టినరోజు జరుపుకోగా.. అతియా తన బాయ్ ఫ్రెండ్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పింది.
‘నీతో ఎక్కడికైనా వెళ్లడానికి ఇష్టపడతాను’ అంటూ శుభాకాంక్షలు చెప్పింది. గతేడాది ఇంగ్లాండ్ టూర్‌కు రాహుల్‌తో పాటు అతియా కూడా వచ్చింది. వీరిద్దరూ తమ ప్రేమ గురించి బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా చెప్పేస్తున్నారు. అంతేకాకుండా అతియా శెట్టి కుటుంబంతో కేఎల్ రాహుల్ ఎంతో క్లోజ్‌గా ఉంటున్నాడు. అతియా సోదరుడి అహన్ నటించిన తడప్ ప్రీమియర్ షోలోనూ పాల్గొన్నాడు. అతియా శెట్టి 2015లో విడుదలైన హీరో అనే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.