
యాంకర్ నుండి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు మూడు పెద్ద సినిమాలకు తనను ఎంపిక చేసి, ఆ తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా తొలగించారని ఆమె పేర్కొన్నారు. ఆ బాధతో ఒకరోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో భర్త దగ్గర వెక్కి వెక్కి ఏడ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను అప్పుడప్పుడు పరిమితంగా డ్రింక్ చేస్తానని, ఆ విషయాన్ని కూడా కొందరు వివాదంగా మార్చి ట్రోల్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..
బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా రాణిస్తున్న ఆమె, గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. అయితే బయటకు ఎంతో ధైర్యంగా, బోల్డ్‌గా కనిపించే అనసూయ కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను, బాధలను భరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పరిశ్రమలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..!!
