
నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్, తన చిరకాల కోరికను బయటపెట్టారు. తన ఆరాధ్య దైవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉలిక్కిపడేలా ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని, ఆ ఒక్క సినిమా తర్వాత ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్‌ను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల ‘రాజా రవీంద్ర టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌ను ‘పవనేశ్వరా’, ‘దేవరా’ అంటూ దేవుడిలా ఆరాధించే ఆయన, తన దేవుడితో మరో సినిమా తీయాలన్నదే తన జీవితాశయమని స్పష్టం చేశారు. “నాకు ఒక కోరిక ఉంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో మళ్లీ పవన్ తో సినిమా తీయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలుగోడు ఉలిక్కిపడే విధంగా సినిమా తీసి ఆ బ్యానర్‌ను ఆపేయాలన్నది నా కోరిక” అని బండ్ల గణేష్ తన మనసులోని మాటను చెప్పారు..!!

