
టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి. తొలి సినిమాతోనే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశాన్ని అందుకున్న ఈ తెలుగమ్మాయి..తన ప్రతిభతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' సినిమాతో ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కల్పన అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సినిమాలపై ఆసక్తితో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని ఇండియాకు వచ్చిన సాత్విక ప్రయాణం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాత్విక వీరవల్లి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తనను పోల్చడం, రన్నింగ్ విషయంలో వచ్చిన ప్రశ్నలపై ఆమె స్పందించిన తీరు చర్చకు దారితీసింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో పోలిక రావడం తనకు ఎలా అనిపించిందో ఆమె తనదైన శైలిలో వివరించింది. ఇటీవల ఒక సందర్భంలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ పరుగెత్తేవిధానం చూస్తుంటే పెగాసస్ (రెక్కల గుర్రం) గుర్తుకొస్తుందని ఆమె అన్నారు. ఆయన రన్నింగ్ స్టైల్‌లో అంతటి గ్రేస్ ఉంటుందని, చాలా సులభంగా, సహజంగా పరుగెత్తుతున్నట్లు కనిపిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు, మహేష్ బాబులో కనిపించే ఆ అందమైన పరుగుల శైలిలో కనీసం సగం గ్రేస్‌ను కూడా తాను సాధించలేనని సరదాగా వ్యాఖ్యానించారు. సాధారణంగా మహేష్ బాబు సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్లకు మంచి ఆదరణ ఉంటుంది.
అయితే ఆయన బాడీ లాంగ్వేజ్‌లో ఉండే ప్రత్యేకత గురించి సాత్విక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒక స్టార్ హీరోలోని చిన్న చిన్న విషయాలను కూడా అభిమానులు ఎంతగా గమనిస్తారో ఈ కామెంట్స్ మరోసారి తెలియజేస్తున్నాయి. ఇక సాత్విక వీరవల్లి విషయానికి వస్తే..అమెరికాలో ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి రెండేళ్లు ఉద్యోగం చేసిన ఆమె నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న గీతా ఆర్ట్స్ ప్రాజెక్టులోనూ ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంటున్న సాత్విక.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..!!
