
కీర్తి సురేష్‌తో కలిసి రాధికా ఆప్టే నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అక్కా’ ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తన సౌత్ ఇండస్ట్రీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో నేను చేసిన ఓ చిత్రంలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రోమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు, కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉంటాయి. పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు అంటూ రాధికా ఆప్టే అసంతృప్తి వ్యక్తం చేశారు..
ఆమె ఏ సినిమా పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘లెజెండ్’ గురించే ఈ వ్యాఖ్యలు అని సినీ ప్రియులకు ఇట్టే అర్థమైపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే బాలయ్యకు మరదలి పాత్రలో కనిపించగా, ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె పాత్ర ముగిసిపోతుంది. రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కథ నచ్చకపోతే, పెద్ద హీరోతో నటించడం ఇష్టం లేకపోతే అసలు ఆ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఇండియాలో ‘మేనరికం’ అనేది తరతరాలుగా వస్తున్న సంస్కృతి అని, ప్రాంతీయ సినిమాలు చేస్తున్నప్పుడు ఇక్కడి నేటివిటీని గౌరవించాలని హితవు పలుకుతున్నారు.!!

