
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘AA23’పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరగ్గా..దర్శకుడు లోకేశ్ తాజా పోస్టుతో ఆ ఊహాగానాలకు తెరదించారు. త్వరలోనే ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. లోకేశ్ కనగరాజ్ సోమవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అల్లు అర్జున్‌తో మాట్లాడుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘‘ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే వస్తున్నాయి’’ అంటూ క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో మళ్లీ అంచనాలు పెరిగాయి..
అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ తొలిసారి కలిసి పనిచేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అందులో ఓ సింహం స్థిరంగా నిలబడగా..దాని చుట్టూ కొన్ని నక్కలు తిరుగుతూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తాయి. ఈ వీడియో సినిమా కథ గురించి పెద్దగా వివరాలు వెల్లడించకపోయినా..ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెంచింది. ‘AA23’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప’ను కూడా ఈ నిర్మాణ సంస్థే తెరకెక్కించింది..!!

