
ఈసినిమాలో మహేశ్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వెరైటీ’ కథనం ప్రకారం.. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో ప్రధాన పాత్రలు ప్రాచీన లిపి ఉన్న ఓ గుహలోకి వెళ్తాయి. అక్కడి గోడలపై ఉన్న రాతల్లోని రహస్యాన్ని ఛేదించాలంటే వారికి ఆ కొత్త భాషను అర్థం చేసుకోవాల్సి ఉంటుందట. కథలో ఈ భాష కీలక పాత్ర పోషించనుందని సమాచారం.
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోనూ రాజమౌళి కల్పిత భాషను ఉపయోగించిన విషయం తెలిసిందే. గేయ రచయిత, రచయిత మదన్ కార్కీ సహకారంతో రూపొందించిన ‘కిలికి’ భాషను ఆ సినిమాలో కాలకేయులు మాట్లాడారు. అయితే ‘వారణాసి’లో ఈ భాషకు మరింత ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. పదాలు, వాక్య నిర్మాణం, లిపి సహా పూర్తి భాషను అభివృద్ధి చేయడానికి ఓ భాషా నిపుణుడిని నియమించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు గతంలో ‘మిడ్ డే’ కథనం వెల్లడించింది..!!

