
భారతీయ సినీ పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. సినిమాలోని భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హాలీవుడ్ రీమేక్ వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ హాలీవుడ్ స్థాయికి వెళుతున్నాయనేందుకు ఈ పరిణామం చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని హాలీవుడ్‌లో అధికారికంగా రీమేక్ చేయనున్నారు. ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్కానగీ ఈ రీమేక్‌లో లీడ్ రోల్‌ను పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చైనా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన అనంతరం ఒక హాలీవుడ్ ఏజెన్సీ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం సంప్రదించిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాత సుధన్ సుందరం తెలిపారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ సినిమా రీమేక్ కావడం భారతీయ చిత్రసీమకు గర్వకారణమని అభిమానులు భావిస్తున్నారు..!!
