ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాను పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ లెక్కలేనంతగా ఖర్చు పెడుతోంది. కొత్త టెక్నాలజీని వాడుతోంది. నాగ్ అశ్విన్ ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12న ఈ సినిమా థియేటర్లో సందడి చేయబోతోంది. మహానటి తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా కోసం మహింద్రా కంపెనీ నుంచి సపరేట్గా ఇంజనీర్లు రావడం, సినిమా కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయించడం చూస్తుంటే నాగ్ అశ్విన్ విజన్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా వస్తోందంటూ నాగ్ అశ్విన్ ఇది వరకే ఎన్నో సార్లు చెప్పేశాడు. మామూలుగా అయితే ఈ సినిమాను ఈ ఏడాది దసరాకే విడుదల చేయాలని అశ్వనీదత్ అనుకున్నాడు. దసరా ప్లస్ ప్రభాస్ బర్త్ డే కలిసి వస్తుందని ఆశించాడు. కానీ ఇప్పుడు కొత్త డేట్ను ప్రకటించేశారు మేకర్లు..!!