ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని, లేకపోతే తెలిసినా పెద్దగా గుర్తు లేని విషయాలను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, సూర్యనారాయణ రాజు దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా మొదటి సంతానంగా ప్రభోధ్ జన్మించారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఒక సోదరి కూడా ఉన్నారు ఆవిడ పేరు ప్రగతి, అయితే ఈ ముగ్గురిలో ప్రభాస్ చిన్నవాడు.
భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసిన ప్రభాస్ శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ నుంచి బీటెక్ పట్టా అందుకున్నారు. తన కెరీర్ లో వర్షం సినిమాతో హిట్ అందుకోవడం మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో భాగమయ్యారు. అయితే ఒక రకంగా మంచి హిట్స్ లో ఉండగా రాజమౌళి చెప్పిన బాహుబలి కథ విని దాదాపుగా ఆ కథ కోసం రెండు మూడు ఏళ్లు వెచ్చించారు ప్రభాస్. అలా సుమారు 600 రోజులు బాహుబలి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీక్వెల్ కోసం మరో రెండేళ్లు వెచ్చించడంతో ఇలా తన కెరియర్లో దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే వెచ్చించారు.
ప్రభాస్ ఒక బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ థాయిలాండ్ లోని మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఉంది, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు. ఇక సాధారణంగా సినీ పరిశ్రమలో ఉన్న వారి కుటుంబ సభ్యులందరూ సినీ పరిశ్రమలోనే ఏదో ఒక విభాగంలో పనిచేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం ముందు హీరో అవ్వాలి అనుకోలేదట. ఆయన క్యాటరింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చి ఒక మంచి హోటల్ కూడా నిర్వహించాలని భావించాడట..!!