పెళ్ళిచూపులు చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్‌లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి. ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. స్క్రిప్టు ఓకే అయిందని, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘నారప్ప’ సినిమాను పూర్తి చేశాడు వెంకీ. ఈ సినిమా మే 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే..