బాలు కొవిడ్ 19 పాజిటివ్ అని తేలి ఎంజీఎం హాస్పిటల్లో చేరిన కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు రావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆశిస్తూ టాలీవుడ్‌లోని సంగీతకారులు, కోలీవుడ్ వర్గాలు సామూహిక ప్రార్థనలు చేయడం ఒక అసాధారణ విషయం. ఒక కళాకారుడికి సంబంధించి ఇలాంటి ఘట్టం ఇదివరకు మనం చూడలేదు. అంతేకాదు, ఇళయరాజా, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు లాంటి దిగ్గజాలు సహా వందలాది మంది సెలబ్రిటీలు ఆయన క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటూ ప్రకటనలు జారీచేయడం, ఆయనతో తమ అనుబంధం పంచుకోవడం కూడా బాలు మహోన్నత స్థాయిని తెలియజేసే విషయం.
బాలు కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్య స్థితిగతుల గురించి పంచుకుంటూ రావడం, కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగవుతూ వస్తోందనీ, వ్యాయామం కూడా చేస్తున్నారని తెలపడంతో అశేష అభిమానులు ఎంతో సంబరపడ్డారు. ఆయన మళ్లీ మనముందుకు వచ్చి, పాటలు పాడతారని ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది హఠాత్తుగా ఆయన కొన ఊపిరితో మృత్యువుతో యుద్ధం చేస్తున్నారని తెలియడంతో గుండెలు ఉగ్గబట్టుకొని ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. చివరకు తండ్రి కన్నుమూశారనే వార్తను కన్నీటి పర్యంతమవుతూ చరణ్ స్వయంగా చెప్పడంతో వారి గుండెలు బద్దలయ్యాయి..