ఏం.ఎస్.నారాయణ చివరి కోరిక
నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వ లేక పోవటం ఒక రోగం అంటారు జంధ్యాల గారు. ఆయన ప్రారంభించిన తెలుగు తెర హాస్య యాగం లో ఎందరో హాస్య ఋషులు ఆ యాగాన్ని సుసంపర్ణం చేసారు. తెలుగు వెండి తెర మీద ఉన్నంత మంది హాస్య నటులు ఏ ఇతర సినీ పరిశ్రమలో లేరు అనిపించినంతగా నవ్వుల పువ్వులు పూయించారు మన హాస్య నటులు ఒక రెండు దశాబ్దాల పాటు, అదొక హాస్య స్వర్ణ యుగం, అందులో చెప్పుకో తగిన వారిలో ఒకరు ఏం.ఎస్.నారాయణ. తాగుబోతుగా ఒకే రకం పాత్రలో వైవిధ్యం చూపించి, తెర మీద ఏం.ఎస్.కనిపించిన వెంటనే ప్రేక్షకుడు నవ్వుకొని, మన నారాయణ వచ్చాడ్రా అనే అంతగా రంజింపచేసారు ఏం.ఎస్. అటువంటి నారాయణ అనారోగ్యం తో హాస్పిటల్ లో ఉండగా, చివరిగా ఆయన ఒక కోరిక కోరారు, అదేమిటంటే బ్రహ్మానందం గారిని చూడాలని. ఆ విషయాన్నీ అయన నోటితో చెప్పలేని పరిస్థితిలో పేపర్ మీద వ్రాసి చూపించారు..
మనసులోని మాట చెప్పకుండానే వెళ్లిపోయిన ఏం.ఎస్.నారాయణ
విషయం తెలిసిన బ్రహ్మ్మనందం పరుగు, పరుగు న హాస్పిటల్ కి అయితే వెళ్లారు గాని మరణశయ్య మీద ఉన్న తన తమ్ముడిని చూసి తట్టుకెలేక పోయారు. ఆయన్ను చూసిన ఏం.ఎస్. ఏదో చెప్పాలని ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు, అది చూడ లేక బ్రహ్మానందం బయటకు వెళ్లిపోయారట. బహుశా నీ నట సాహచర్యం వీడుతున్నందుకు క్షమించమని అడగలనుకున్నారో ఏమో ఏం.ఎస్. వెండి తెర మీద నవ్వుల వెన్నెలలు కురిపించిన ఏం.ఎస్. తన మనసులోని మాట చెప్పకుండానే వెళ్లిపోయారు. అదేమిటో తెలుగు సినిమా కు ఏదో శాపం తగిలినట్లు చాల తక్కువ కాలంలో, వెండి తెర హాస్య నటులందరూ కట్టగట్టుకొని, పరలోకం చేరుకున్నారు. ఏం.ఎస్ ఒక్కరే కాదు ఆ టైం లో నిష్క్రమించిన, ధర్మవరపు, వేణు మాధవ్ , ఆహుతి ప్రసాద్, శ్రీ హరి, ఏ.వి.ఎస్. తమ నటవారస వీలునామాలు వ్రాయకుండానే నిష్క్రమించటం మన దురదృష్టం..!!