పక్కా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు గోపీచంద్. కంప్లీట్ యాక్షన్ సినిమా చేసినప్పుడు గోపీకి మంచి ఫలితాలే వచ్చాయి. కాదని.. పక్క దారి వెళ్లినప్పుడు ఫ్లాపులు తగిలాయి. ఎన్నో ఆశలు పెట్టుకొన్న పక్కా కమర్షియల్ బోల్తా కొట్టింది. ఇప్పుడు ఓ మంచి మాస్, కమర్షియల్ సినిమా చేస్తే గానీ, తను మళ్లీ ట్రాకులో రావడం కష్టం. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది..సింగం సిరీస్‌తో తమిళ నాట సంచలన విజయాల్ని అందుకొన్న దర్శకుడు హరి. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
తను ఇటీవల గోపీచంద్ ని కలిసి ఓ కథ చెప్పాడని సమాచారం. ఆ కథ గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో ఈ కాంబో ఓకే అయ్యిందని తెలుస్తోంది. నిజానికి ఈ కథ ఎన్టీఆర్ చేయాల్సిందని టాక్. ఎన్టీఆర్ కి కథ నచ్చినప్పటికీ.. తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల హరితో చేయలేకపోయాడని, ఆ కథ ఇండస్ట్రీ మొత్తం తిరిగి ఇప్పుడు గోపీచంద్ దగ్గరకు వచ్చిందని సమాచారం. హరి.. మంచి మాస్ డైరెక్టర్. కథ కుదరాలే గానీ, తాను అద్భుతాలు సృష్టించగలడు. మరి గోపీచంద్ తో అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందో, లేదో చూడాలి.