ప్రముఖ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు కాసేపట్లో చెన్నైలో జరగబోతున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని టీనగర్ లో శరత్ బాబు నివాసం వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాసేపటి క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ శరత్ బాబు నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు.
నటుడు కాకముందు నుంచి ఆయనతో తనకు పరిచయం ఉందని.. తనపట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని తెలిపారు. శరత్ బాబు తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. ఆయన మృతి తనను కలచివేసిందని రజనీ చెప్పారు. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారని, ఆయన కోపంగా ఉండటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని నాకు ఎన్నోసార్లు చెప్పేవాడని తెలిపారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు రజనీకాంత్..!!