తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కూడా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తరహాలోనే పబ్లిక్ నోటీస్ ఇచ్చి మరి తన అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్ ఉపయోగించుకునే వారికి వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా తన పేరు కానీ లేదా ఫోటోలు లేదా వాయిస్.. ఇలా ఏవీ ఉపయోగించడానికి వీల్లేదని రజినీకాంత్ స్పష్టంచేశాడు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ వాడుకుని తనకు ఉన్న కీర్తి ప్రతిష్టలను అప్రతిష్టపాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రజినీకాంత్ తన పబ్లిక్ నోటీసులో పేర్కొన్నాడు. కాపీ రైట్స్ పరంగా తన పబ్లిక్ నోటీస్‌ని కాదని నిబంధనలు అతిక్రమించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్టు రజినీకాంత్ తరపు న్యాయవాది ఎస్ ఎలంభారతి తెలిపారు.
తన క్లయింట్ రజినీకాంత్ తప్ప మరెవ్వరికీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించుకునేందుకు అనుమతి లేదని అడ్వకేట్ ఎస్ ఎలంభారతి వెల్లడించారు. ఈ మేరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తరపున శనివారం పబ్లిక్ నోటీస్ జారీచేశారు. తన పేరు వాడుకుని కొన్ని వ్యాపార సంస్థలు, ఉత్పత్తి తయారీదారులు, పలు మీడియా మాధ్యమాలు తమ ప్రోడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నాయని.. అలా తన అనుమతి లేకుండా తన పేరు వాడుకుని తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రజినీకాంత్ ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా హెచ్చరించాడు..!!