
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఆయన ఆత్మకథ త్వరలో విడుదల కానుండగా, మరోవైపు ఆయన నటించిన ‘జైలర్ 2’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు తాజాగా రజనీకాంత్తో జరిగిన భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రజనీ తన బయోగ్రఫీపై పనిచేస్తున్నారని, అది తమిళంతో పాటు ఇంగ్లీష్లోనూ విడుదలయ్యే అవకాశం ఉందని సూచించినట్లు తెలిపారు..
‘జైలర్ 2’ సినిమా విడుదల సందర్భంగా రజనీకి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లానని వైరముత్తు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాము కళ, జీవితం గురించి మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. “మీ ఆత్మకథ ఎప్పుడు వస్తుంది?” అని తాను అడగ్గా, “పనులు జరుగుతున్నాయి, త్వరలోనే వస్తుంది” అని రజినీ బదులిచ్చారని వైరముత్తు వివరించారు. “చాలా మందికి చరిత్ర ఉంటుంది, కానీ మీకు చరిష్మా కూడా ఉంది, అందుకే మీ ఆత్మకథ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు” అని తాను చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు..!!

