నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ ,ఇది ఆయన వెండి తెర నామధేయం, అసలు పేరు తాడినాడ వర ప్రసాద్, నటుడిగా ఏ పాత్ర పోషించిన తనదైన బాణీలో ఆయన చెప్పిన డైలోగ్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యే వారు ,” దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ” అంటూ వాపోయిన,నూటొక్క జిల్లాల అందగాడిని అని రెచ్చిపోయిన ప్రేక్షకులు నీరాజనం పట్టారు. నీడ లేని ఆడది చిత్రం తో తెరఁగెట్రం చేసిన నూతన్ ప్రసాద్, మద్రాసుకు మకాం మార్చటానికి సంశయిస్తున్న తరుణం లో నెల్లూరు ప్రేక్షకులు భుజం తట్టి ఆయనను మద్రాసుకు పంపించారు, మద్రాసు చేరాక అన్న గారు అభయం ఇచ్చి మద్రాసులో కాపురం పెట్టించారు. సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి రోజులలో మద్రాసుకు మకాం మార్చటానికి తటపటాయిస్తున్న సమయంలో ఆయన నటించిన చలి చీమలు సినిమా రిలీజ్ అయింది, అప్పట్లో నెల్లూరు టాక్ చాల టఫ్ టాక్ అని పేరుండేది, నెల్లూరు లో అవేరేజ్ టాక్ వస్తే సినిమా వంద రోజులు ఆడుతుంది అని నమ్మే వారు సినిమా వారు. అందుకే ఆయన నటించిన చలి చీమలు సినిమా నెల్లూరు లోని వినాయక మహల్ కి వచ్చి చూసారు నూతన్ ప్రసాద్, అందులో నూతన్ ప్రసాద్ నూటొక్క జిల్లా అందగాడిని అనగానే,
” ఓరి నీ పాసుగాల, వీడెవడ్రా మావ బలే ఉండాడే” అన్నారు నెల్లూరీయులు , వరసగా మూడు షోలు చూసిన నూతన్ ప్రసాద్, ప్రేక్షకుల ముందుకు వచ్చి “నెల్లూరు గెలిచాను, మీరు ఆశీర్వదిస్తే మద్రాసు గెలుస్తాను” అని వినమ్రంగా చేతులు జోడించగానే ” ఏం భయపడబాక అబ్బాయా , అమ్మ బడవ! మద్రాసు దున్నేస్తావు!” అని ఆశీర్వదించారు. నెల్లూరీయులు ఇచ్చిన భరోసాతో మద్రాసుకు షిఫ్ట్ అయ్యారు నూతన్ ప్రసాద్. యెన్.టి.ఆర్. తో కలసి “మావారి మంచితనం” చిత్రం లో నటించారు, యెన్.టి.ఆర్ కాంబినేషన్ లో పదిహేను షాట్స్ ఉన్న సీన్, సింగల్ టేక్ లో ఒకే చేసేసారు నూతన్ ప్రసాద్, షాట్ గ్యాప్ లో బయట సిగరెట్ కాల్చుకుంటున్న నూతన్ ప్రసాద్ కి అన్న గారి నుంచి పిలుపు వచ్చింది. కంగారుగా ఆయన వద్దకు వెళ్లిన నూతన్ ప్రసాదును ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏం బ్రదర్ అమ్మాయిని తీసుకొని రాలేదా ? అని అడిగారట, లేదు సర్, ఇంకా నిలదొక్కుకోవాలి అందుకే ఒక్కడినే ఉంటున్నాను అన్నారట, ఏం భయం లేదు బ్రదర్ మేమున్నాం, మీరు అమ్మాయిని తీసుకొని వచ్చి కాపురం పెట్టండి, మా సినిమాలలో మీకు తప్పకుండ క్యారక్టర్ ఇప్పిస్తాను అని భరోసా ఇచ్చారట. అలా నూటొక్క జిల్లాల అందగాడిని నెల్లూరీయులు భుజం తట్టి మద్రాసుకుకు పంపితే, అన్న గారు భరోసా ఇచ్చి కాపురం పెట్టించారు.