బహుముఖ ప్రజ్ఞ శాలి భానుమతి గారు, కేవలం నటి మాత్రమే కాదు, రచయిత్రి, నిర్మాత, డైరెక్టర్ అన్నింటికీ మించి, మంచి గాయని. అంతే కాదండోయ్, మంచి సమయస్ఫూర్తి, చతురత కూడా ఆమెకు అదనపు ఆకర్షణ. 1974 లో యెన్.టి.ఆర్. తాతమ్మకల అనే చిత్రం నిర్మిస్తూ, భానుమతి గారిని ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నారు, కధా రచయిత అయిన డి.వి.నరసరాజు గారిని ఆమె కు రెమ్యూనరేషన్ ఎంత కావాలో అడగమని పంపించారు, దానికి ఆవిడా ఆయన హీరో కదా? ఆయన తీసుకునే దానికి ఒక అయిదు వేలు తక్కువ చేసి ఇవ్వమని చెప్పారట. అప్పట్లో యెన్.టి.ఆర్. ఒక చిత్రానికి నాలుగు లక్షలు తీసుకుంటున్నారు. కానీ ఆయన లక్ష తొంభై అయిదు వేలు ఇచ్చి, తాను తీసుకుంటున్నది రెండు లక్షలే అని చెప్పకనే చెప్పారు నరస రాజు గారి ద్వారా, అవతల ఉన్నది ఎవరు? భానుమతి గారు!!! ఆమెతో మజాకా కాదు!!!
నరస రాజు గారు ఒకింత బెరుకుగానే , అదే విషయం భానుమతి గారికి చెప్పి డబ్బులు ఆమెకు ఇచ్చారట. అది చూసి ఒక నవ్వు నవ్విన ఆవిడా, వెంటనే దానికి ఇంకో అయిదు వేలు చేర్చి, రెండు లక్షలు నరస రాజు గారి చేతిలో పెట్టి, భరణి పిక్చర్స్ పేరు మీద తానూ నిర్మిస్తున్న “అమ్మాయి పెళ్లి” చిత్రం లో యెన్.టి.ఆర్. ని హీరో గ నటించమని కోరానని చెప్పమన్నారట. దెబ్బకు నరస రాజు గారికి నోట మాటలేదట, చూసారా ఆమె ఎంత చతురురాలో, నిమిషంలో యెన్.టి.ఆర్. గారు చేసిన జిమ్మిక్కు అర్ధం చేసుకొని, ఎదురులేని బాణం వేసి యెన్.టి.ఆర్ గారి రెమ్యూనరేషన్ రెండు లక్షలు తగ్గించేసి, తన చిత్రం లో నటించేట్లు చేసుకున్నారు. అదే ఆమె చతురత, మరియు సమయస్ఫూర్తి. విషయం తెలుసుకున్న యెన్.టి.ఆర్. చేసేది ఏమి లేక రెండు లక్షలకే ఆమె నిర్మించిన అమ్మాయి పెళ్లి చిత్రంలో నటించారట. అలా భానుమతి గారు యెన్.టి.ఆర్. నే బోల్తా కొట్టించారు..!!