ఇప్పుడయితే టి.వి. చానెల్స్, యూ ట్యూబ్ చానెల్స్ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, అన్నింటిలో ఎక్కువ క్రేజ్ ఉండే వార్తలు సినీ రంగం గురించే వచ్చేవే. సినీ రంగం లో చీమ చిటుక్కుమన్నా అది పెద్ద వార్త అయిపోతుంది ఈ చానెల్స్ పుణ్యమా అని. కొన్ని చానెల్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి, మరి కొన్ని గాసిప్స్ ప్రచారం చేస్తుంటాయి. ఇవేమి లేని రోజుల్లో సినీ పత్రికలలో మాత్రమే సినిమా వారి గురించి కొన్ని కధనాలు, వార్తలు వస్తుండేవి,అప్పట్లో సినిమా వారి గురించి తెలుసుకొనేందుకు సామాన్య ప్రేక్షకుడికి ఉండే ఒకే ఒక మాధ్యమం సినీ పత్రిక మాత్రమే.ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన ప్రముఖుల జీవిత విశేషాలు వారం, వారం కొన్ని కధనాలు ప్రచురించే వారు. ఒక సారి ఒక ప్రముఖ పత్రిక డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారికి ఈ బాధ్యతను అప్పగించింది, అది కూడా యెన్.టి.ఆ.ర్ గురించి వ్రాయమని చెప్పింది. సి.నా.రే. సినీ రంగానికి వచ్చిన కొత్త రోజులు కాబట్టి ఒప్పుకొని వ్రాయటం మొదలు పెట్టారు.
ఈ విషయం యెన్.టి.ఆర్. కి తెలిసింది సి.నా.రే. గారికి ఫోన్ చేసి ” ఏం బ్రదర్ మా గురించి వ్రాస్తున్నారట, ఏం వ్రాస్తున్నారో?” అని అడిగారట. దానితో సి.నా.రే. తడబడుతూనే, “ఏమి లేదు సర్ ఒక పత్రిక వారు అడిగారు అందుకే వ్రాస్తున్నాను, మీ గురించే ప్రత్యేకంగా వ్రాయటానికి ఏముంటుంది”, అన్నారట. “వ్రాయటానికి చాలానే ఉంది, ఏది వ్రాసిన నిర్మొహమాటంగా వ్రాయండి, వాస్తవాలు వ్రాయండి, గాసిప్స్ వద్దు” అన్నారట యెన్.టి.ఆర్. సహజంగానే కవి, ఆ పైన అన్నగారి నుంచి అభయం అందింది, ఇక సి.నా.రే. గారు యెన్.టి.ఆర్. జీవిత విశేషాలను ఎంతో మనోహరంగా, ఉత్తేజ భరితంగా వర్ణించారట. యెన్.టి.ఆర్. సినీ రంగానికి ఎలా వచ్చారు, ఎలా ఎదుగుతున్నారు అనే వివరాలను పూసగుచ్చినట్లు వివరించారట సి.నా.రే. ఈ కధనం ప్రచురించిన తరువాత దానిని యెన్.టి.ఆర్. సేకరించి ఫ్రెమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నారట, ప్రస్తుతం ఈ ఫ్రెమ్ బాలయ్య బాబు ఇంట్లో పదిలంగా ఉండటం విశేషం..