
పెళ్లి, పిల్లల విషయంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక, వయసు సంబంధిత ఒత్తిడిని అధిగమించేందుకు తాను కొన్ని సంవత్సరాల క్రితమే తన అండాలను ఫ్రీజ్ (Egg Freezing) చేయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా, ఎలాంటి టైమ్‌లైన్ ఒత్తిడి లేకుండా జీవించే స్వేచ్ఛను పొందానని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ వ్యవస్థాపకురాలు కరిష్మా మెహతాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృతి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
మహిళలు ఎదుర్కొనే ‘బయోలాజికల్ క్లాక్’ సమస్య గురించి హోస్ట్ ప్రశ్నించగా, కృతి స్పందిస్తూ.. “నిజాయతీగా చెప్పాలంటే, నేను నా అండాలను ఫ్రీజ్ చేయించుకున్నాను. పెళ్లి ఇప్పుడే చేసుకోవాలి, పిల్లల్ని ఇప్పుడే కనాలి అనే ఒత్తిడికి నేను లోనవ్వాలని అనుకోలేదు. వివాహం అయినా, పిల్లలైనా సరే.. మనసులోంచి రావాలి కానీ, ఎవరో చెప్పారని, వయసు అయిపోతోందని కాదు” అని ఆమె స్పష్టం చేశారు. ఈ సదుపాయం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చని, కానీ తాను ఆ ఖర్చు భరించగలిగినందుకు అదృష్టవంతురాలినని ఆమె అన్నారు..!!

