ఈరోజుల్లో పారితోషికాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ హిట్టు కొడితే చాలు.. కోట్లు డిమాండ్ చేస్తున్నారు హీరోలైనా, హీరోయిన్లయినా, డైరక్టర్లయినా అంతే. ఇది వరకు అలా కాదు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలలో నెల జీతానికి పనిచేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు సైతం తమ కెరీర్ ని నెల జీతంతోనే మొదలెట్టారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఓ సినిమా హిట్టయితే… వాళ్లే గట్టిగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి రోజుల్లో కూడా.. ఓ దర్శకుడికి నెల జీతం ఇచ్చి, సినిమా తీయించుకుంది ఓ సంస్థ. ఆదర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అయితే, ఆ సంస్థ గీతా ఆర్ట్స్. గీతా ఆర్ట్స్ లో ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అఖిల్ హీరోగా నటించాడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఈ సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ కి పారితోషికం ఏం ఇవ్వలేదు. కేవలం ఆయన నెల జీతానికి పనిచేశాడట.
నెలకు 2 లక్షల జీతం ఇచ్చేవారని తెలుస్తోంది. బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ ని తీసిన దర్శకుడ్ని… గీతా ఆర్ట్స్ చాలా చీప్ గా పట్టేసినట్టే లెక్క. ఇప్పుడు ఈ సినిమా ఎలాగూ హిట్టయ్యింది కాబట్టి… ఇప్పుడు పారితోషికం ఇచ్చే అవకాశం ఉంది. సినిమా ప్రారంభంలో పారితోషికాలు ఇవ్వకపోయినా, సినిమా హిట్టయితే… భారీ గిఫ్టులు ఇచ్చే సంస్కృతి తెలుగులోనూ మొదలైంది. `ఉప్పెన` కోసం బుచ్చిబాబుకి అదే చేశారు. తనకు ప్రత్యేకంగా పారితోషికం ఏమీ ఇవ్వలేదు. సినిమా హిట్టయ్యేసరికి కారు, ఫ్లాటూ కొనిచ్చేశారు. కానీ పాపం భాస్కర్ విషయంలో అల ఏమి జరగలేదు..