మీనా భర్త విద్యాసాగర్ 48 ఏళ్ళ వయసులో మరణించాడు. దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో మీనా ఒకరు. 2009లో సంప్రదాయ పద్ధతిలో విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. నిన్న(జూన్ 28) సాయంత్రం విద్యాసాగర్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు చెన్నైలోని బీసెంట్ నగర్‌లో జరుగుతాయి. విద్యాసాగర్, మీనా దంపతులకు కుమార్తె నైనిక ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన మీనా 90, 2000 దశకంలో ప్రముఖ హీరోలందరితో హీరోయిన్‌గా సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఆమె చివరిగా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాలో కనిపించింది. మీనా భర్త మృతికి అరుదైన ఇన్ఫెక్షన్ కారణమైంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగానే విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
తమిళనాడు నుండి వెలువడుతున్న కొన్ని నివేదికల ప్రకారం, విద్యాసాగర్ వారి ఇంటికి సమీపంలో ప్రతి రోజు వస్తున్న పావురాల గుంపు వాటి రెట్టల ద్వారా సోకిన గాలిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల అలెర్జీకి గురయ్యారని పేర్కొన్నాయి. అయితే ఇది లక్ష మందిలో ఒకరికి మాత్రమే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబం కోవిడ్ బారిన పడింది. అయితే విద్యాసాగర్‌కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. దాంతో ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. కానీ సరైన దాత దొరకనందున, మార్పిడి చేయడం సాధ్యం కాలేదు. అంతలోనే ఆయన మృత్యువాత పడ్డారు. విద్యాసాగర్ మృతి వార్త విని మీనా స్నేహితులు, అభిమానులు, సినీ పరిశ్రమలోని వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.