నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 106వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే బిబి3 తర్వాత బాలకృష్ణ తదుపరి సినిమా చారిత్రక నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద చిత్రాల్లో నటించిన నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నటవారసుడిగా బాలకృష్ణ కూడా అప్పుడప్పుడు తనకి ఇష్టమైన పౌరాణిక చారిత్రక పాత్రలు వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
ఇంతకుముందు ‘పాండురంగడు’ ‘శ్రీరామరాజ్యం’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో చారిత్రక వీరుడు ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో బాలయ్య నటించనున్నాడని తెలుస్తోంది. కాగా కాకతీయుల చరిత్రలో చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డి కి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి కాలంలో రుద్రమదేవి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. ఇంతకముందు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే.