ఈ లాక్‌డౌన్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్‌గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ చాలా ఉద్వేగంగా ఉంటుంది.
సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.. ఆ పాత్రలో ఎంత బాగా నటించాం? దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది. ‘వి’ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను. అది మిస్సయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్‌లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే” అన్నారు.