
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో ఏళ్లుగా విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్స్‌లు, తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు సినిమాల్లో హీరోగా కనిపించిన ఆయన, తొలిసారి ఓటీటీ వేదికపై టాక్ షో నిర్వాహకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి 'చిరంజీవి మెగావర్స్' పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షో షూటింగ్ పనులు మొదలయ్యాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రోమో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రోమోలో చిరంజీవి ఎంట్రీని చాలా విభిన్నంగా చూపించారు..
నిమిషం నాలుగు సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో తొలుత ఆటో ఎంట్రీని చూపిస్తూ ప్రోమోను ఆసక్తికరంగా ప్రారంభించారు..ఇందులో చిరంజీవి పేరును ఇంగ్లిష్‌లో చూపించే విధానంలో 'N' అక్షరాన్ని ఉద్దేశపూర్వకంగా మిస్ చేశారు. మొదట ఈ మార్పు ఎందుకు చేశారో అర్థంకాకపోయినా, చివరికి దాని వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్‌ను వెల్లడించారు. 'చిరంజీవి పేరులో N అక్షరం లేదేంటి?' అనే భావనతో సాగే పాట కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివర్లో ఆ మిస్సింగ్ అక్షరాన్ని నెట్‌ఫ్లిక్స్ లోగోతో అనుసంధానించి చిరంజీవి ఓటీటీ ప్రయాణాన్ని పరిచయం చేశారు. అలాగే మెగాస్టార్ తనదైన శైలిలో 'ఇది నా అడ్డా' అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం ద్వారా మెగా వినోదం, సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇందులో చిరంజీవి పలువురు సినీ ప్రముఖులతో ముచ్చటించనున్నారు.
వారి వ్యక్తిగత, సినీ జీవితంలోని ఆసక్తికరమైన అనుభవాలు, సినిమాల వెనుక జరిగిన విశేషాలు ఈ షోలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవి తన అతిథులతో చేసే సంభాషణలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ టాక్ షో నిర్మాణ బాధ్యతలను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కాగా, పలువురు ప్రముఖులతో ఎపిసోడ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షోలో పాల్గొనే అతిథుల వివరాలు, మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే 'మెగావర్స్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రోమో ద్వారా వెల్లడించారు. మరి సినిమాలతో ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న చిరంజీవి టాక్ షో హోస్ట్‌గా ఎలాంటి వినోదాన్ని అందిస్తారో చూడాలి..!!
