
భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలను మార్చిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి ముందుంటారు. ఆయన సినిమాలంటే కేవలం భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు.. పెట్టిన పెట్టుబడిని అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ లాభాలుగా మార్చే బిజినెస్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’తో మరోసారి సరికొత్త బాక్సాఫీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా బడ్జెట్‌పై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఆసక్తికరమైన విషయం థియేట్రికల్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమారు రూ.285 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్క డీల్‌తోనే సినిమా బిజినెస్‌పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు ఇతర భాషల హక్కులు కూడా నిర్మాతలకు కీలకంగా మారనున్నాయి.
ఇక తాజా అప్‌డేట్ విషయానికి వస్తే.. నవంబర్ 16న చిత్రబృందం షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం సీజీ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. మహేష్ బాబు రుద్ర పాత్రలో, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజమౌళి తన బాక్సాఫీస్ మ్యాజిక్‌తో మరోసారి ఎన్ని రికార్డులు తిరగరాస్తారో చూడాలి!

