
తన కెరీర్‌లో ఎదుర్కొన్న గడ్డు కాలాన్ని బయటపెట్టింది శ్రియ. దాదాపు 2 దశాబ్దాల పాటు సౌత్-నార్త్‌లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ, ఒక దశలో తనను ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన ఓ ఘటనను కూడా బయటపెట్టింది. 2007లో ఇమ్రాన్ హష్మితో కలిసి ‘ఆవారాపన్’ అనే సినిమా చేసింది శ్రియ. అందులో పాటలు బాగా క్లిక్ అయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. అయితే సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. హీరోయిన్ల కెరీర్‌లో ఫ్లాపులు సహజం. కానీ శ్రియ కెరీర్‌లో ఈ సినిమా అలాంటిలాంటి ఫ్లాప్ కాదు.
ఈ సినిమా దెబ్బకు తనను అవార్డు ఫంక్షన్లకు కూడా పిలవడం మానేశారని గుర్తుచేసుకుంది శ్రియ. నటీనటులెవరికైనా సక్సెస్ చాలా ముఖ్యమని, అది లేకపోతే చిన్నచిన్న కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు అందవనే కఠిన వాస్తవాన్ని బయటపెట్టింది. క్రేజ్ వేరు, సక్సెస్ వేరు అని..క్రేజ్ ఉన్నంత మాత్రాన సక్సెస్‌ఫుల్ గా కెరీర్ కొనసాగించలేమని అంటోంది. దశాబ్దాల కెరీర్ కలిగిన శ్రియ, ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఆమె ఫిజిక్. 43 ఏళ్ల వయసులో కూడా పెర్‌ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ, అదిరిపోయే అందాలతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది శ్రియ..!!
