
ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్రకు ‘లూగర్’ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ‘లూగర్’ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత కచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి ఇది ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక వ్యక్తిలా కాకుండా, శత్రువులను వేటాడే ఆయుధంలా ఉండబోతోందని ఈ పేరు సూచిస్తోంది..
కాగా, ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. అయితే, ‘లూగర్’ అనే పదానికి గూగుల్, వీకిపిడియాలో మాత్రం ఈ అర్థం కనిపిస్తుంది. ఈ చిత్రం 1967 కాలం నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లాక, ఓపియం వ్యాపారం ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’లుగా విడిపోతుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు, రక్తపాతం చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి చెందిన ‘అసాసిన్-ఇన్-చీఫ్’గా కనిపించనున్నారు..!!

