అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం స్టాలిన్ లో చిరంజీవితో ఆడిపాడిన త్రిష మళ్ళీ ఆ తర్వాత జట్టుకట్టలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఎంటర్ టైనర్ లో మరోసారి జోడిగా కనిపించనుందనే వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో చిరుది రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. సిద్దు జొన్నలగడ్డకు తండ్రిగా కనిపిస్తారట. అయితే బలమైన ఎమోషన్లు, సెంటిమెంట్లు కానీ ఏమి లేకుండా క్లీన్ కామెడీతో ఆద్యంతం నవ్వించేలా ప్రసన్న కుమార్ కథను రాసినట్టు ఇన్ సైడ్ టాక్.
అలాంటప్పుడు త్రిష వేసేది తల్లి పాత్ర అవుతుంది. ఒకపక్క తమిళంలో లియో లాంటి సినిమాల్లో స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశాలు వస్తున్నప్పుడు టాలీవుడ్ లో వయసు మళ్ళిన క్యారెక్టర్ ఎందుకు చేస్తారనే సందేహం రావడం సహజం. ఇక్కడే ఉంది అసలు మెలిక. సిద్దుకి చిరు తండ్రే కానీ త్రిష అమ్మ కాదట. అంటే మెగాస్టార్ కు రెండో భార్యగా కావడం కోసం సిద్దు తాపత్రయపడే టైపు ట్విస్టు సెట్ చేశారని తెలిసింది. అలా అయితే ఇబ్బంది లేదు. పైగా ఎంటర్ టైన్మెంట్ ఫ్లోలో ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేనంత వేగంగా స్క్రీన్ ప్లే ఉంటుందని వినికిడి..!!