కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనాలనే తన చిరకాల కల నెరవేరిన ఆనందంలో ఉంది పూజాహెగ్డే. రెడ్ కార్పెట్‌పై అందాలతో మెరిసి ఆకట్టుకున్నది. ఈ వేడుకకు భారత్ నుంచి హాజరైన కథానాయికల్లో పూజాహెగ్డే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే కేన్స్ ప్రయాణం ఊహించని ట్విస్ట్ లతో సాగిందని చెప్పింది. రెడ్ కార్పెట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న డ్రెస్‌లు, మేకప్ కిట్‌లకు సంబంధించిన బ్యాగ్ ఫ్లైట్ జర్నీలో పోగొట్టుకోవడంతో చాలా టెన్షన్ పడ్డానని పూజాహెగ్డే తెలిపింది. ఇండియా నుంచి బయలు దేరే సమయంలో హెయిర్ స్టైలిస్ట్ కు ఫుడ్ పాయిజన్ సమస్య తలెత్తడంతో ఆమె బ్యాగ్ లలో ఒకటి మాత్రమే చెకిన్ అయ్యిందని తెలిపింది. మిగిలినవి ఇండియాలో వదిలిపెట్టి ప్రయాణాన్ని మొదలుపెట్టామని చెప్పింది.
జర్నీలో ఆ బ్యాగ్ కూడా పోవడంతో తనతో పాటు టీమ్ మొత్తం టెన్షన్ పడ్డారని అన్నది..కేన్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసుకున్న డ్రెస్ తో పాటు హెయిర్, మేకప్ కిట్ మొత్తం ఆ బ్యాగ్ లోనే ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదని పేర్కొన్నది. రెడ్ కార్పెట్ పై వెళ్లేందుకు సమయం దగ్గర పడటంతో అందరిలో భయం మొదలైందని పూజ తెలిపింది. అప్పటికప్పుడు ఫ్రాన్స్ లో డ్రెస్ తో పాటు మేకప్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసి ర్యాంప్ వాక్ కు సిద్ధమయ్యానని పూజా హెగ్డే తెలిపింది. రెడ్ కార్పెట్ వాక్ ముగిసే వరకు తనతో పాటు తన టీమ్ ఎవరూ ఫుడ్ ముట్టలేదని తెలిపింది. ఈ చేదు అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పూజాహెగ్డే పేర్కొన్నది.