కరోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అందులో భాగంగానే ధియేటర్లు కూడా మూతపడ్డాయి. తాజాగా కేంద్రం అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో ఆరు నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ” మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ వర్మ వెల్లడించాడు.