శంకరాభరణం చిత్రంలోని శంకర శాస్ట్రీ పాత్ర కు ప్రేరణ ఎవరు? శంకర శాస్ట్రీ గారి కట్టు, బొట్టు, ఆహార్యం, ముఖం లో ఉట్టిపడే విజ్ఞానం దానిని వెన్నంటి ఉండే చిరు కోపం, మిత భాష్యం, అందరికి గుర్తు ఉండే ఉంటాయి. నిజ జీవితం లో ఎవరయినా ఇటువంటి వ్యక్తి ఉండే వార? అంటే, ఉండే వారు, ఆయనే” పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు.ఇక్కడ ఆశ్చర్యకరం అయిన విషయం ఏమిటంటే జె.వి.సోమయాజులు గారి నిజ జీవిత ప్రవర్తన కూడా దాదాపుగా ఇదే విధంగా ఉండేది,అందుకే ఆయన ఆ పాత్రలో జీవించగలిగారు. శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు గొప్ప సంగీత విద్వాంసులు, ఎంతో మంది శిష్యులను తీర్చి దిద్దిన గురువు. శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జీవితం లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు , వారి వ్యక్తిత్వం, ఆయన కట్టు బొట్టు ఆధారంగానే శంకర శాస్ట్రీ పాత్రను మలచారు విశ్వనాధ్ గారు.
మనకు బాగా తెలిసిన సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు, పారుపల్లి వారి శిష్యులే. శంకరాభరణం చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కి ప్రేరణ, ఈ గురు, శిష్యుల మధ్య జరిగిన యదార్ధ సంఘటనే. శంకరాభరణం చిత్రంలో క్లైమాక్స్ సీన్ లో అనారోగ్యం తో గురువు గారు పాడటానికి ఇబ్బంది పడితే, శిష్యుడు వచ్చి పాడి గురువు గారి మన్నన పొందుతాడు, దాదాపుగా ఇటువంటి సంఘటనే నిజ జీవితంలోను జరిగింది. 1942 , జనవరి 7 వ తారీకు తిరువళ్లూరు లో జరుగుతున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాడటానికి బాల మురళి కృష్ణ సమేతంగా వేంచేశారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు.
ఆయనకు వంట్లో కొంచెం నలతగా ఉండటం తో తన శిష్యుడు బాల మురళి కి రెండు కీర్తనలు పాడే అవకాశం ఇవ్వమని నిర్వాహకులను ఒప్పించి, శిష్యుడిని స్టేజి మీదకు పంపారు. పన్నెండేళ్ల బాల మురళి తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను మైమరపించారు. ఆయనకు ఇచ్చిన సమయాన్ని మూడు సార్లు పొడిగించి ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదించారు, అక్కడి విద్వాంసులు అందరు ప్రేక్షకులయి బ్రహ్మ రధం పట్టారు. పారుపల్లి వారి ఆనందానికి అవధులు లేవు తనకు సంగీత వారసుడిని అందించిన వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామికి ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సంఘటనని కొంచెం సినిమాటిక్ గ మలచి శంకరాభరణం చిత్రం క్లైమాక్స్ సీన్ తీశారు విశ్వనాథ వారు.