విబి.రాజేంద్ర ప్రసాద్ , జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, విజయవంతమయిన నిర్మాత, దర్శకుడు అన్నింటికీ మించి, మంచి మనిషి. నిర్మాతగా ఎన్నో విజయవంతమయిన చిత్రాలు నిర్మించి, అక్కినేని గారి ప్రోద్బలం తో “దసరా బుల్లోడు” చిత్రం తో డైరెక్టర్ గ మారారు.నిర్మాతగా అయన ఎన్నోభారీ చిత్రాలు నిర్మించారు, అలాగే మనిషిగా ఆయన హృదయం చాలా విశాలం, ఎంత విశాలమంటే తన నిర్మాణ సంస్థలో పని చేసే వర్కర్స్ కోసం ఒక సినిమా తీసి ఆ లాభాలను అందరికి పంచేటంత. చిత్ర పరిశ్రమ, ఒక విచిత్ర పరిశ్రమ, అక్కడ విజయం మాత్రమే మాట్లాడుతుంది, విజయం వస్తే నాది, అపజయం వస్తే, అందరిదీ అది అక్కడి విధానం. హీరోలకు, టెక్నీషియన్స్ ఒక రకం ట్రీట్మెంట్, మిగతా వారికీ ఇంకొక రకం ఐన ట్రీట్మెంట్ ఇది అక్కడి సంస్కృతి, దానికి భిన్నంగా రాజేంద్ర ప్రసాద్ గారు భోజన సమయం లో వర్కర్స్ తో కూర్చొని భోజనం చేసే వారు, ఎందుకంటె..
తాను అక్కడ కూర్చుంటే వారికీ కూడా సక్రమంగా అన్ని వడ్డిస్తారని. ఎవరయినా కష్టపడేది జానెడు పొట్ట కోసమే కదా! అంటారు అయన. తన విజయాలలో తోడుగా ఉన్న తన ప్రొడక్షన్ స్టాఫ్ మొత్తానికి ఏదయినా చేయాలి అనుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు, వారి కోసం శోభన్ బాబు హీరో గ “పిచ్చి మారాజు” అనే చిత్రాన్ని నిర్మించారు, ఆ చిత్రానికి వచ్చిన లాభాలను తన స్టాఫ్ అందరికి పంచారు. ఆ డబ్బుతో, కొంత మంది ఇల్లు కట్టుకున్నారు, పిల్ల పెళ్లి చేసారు, బిడ్డను ఉన్నత చదువులకు పంపించ గలిగారు. రాజేంద్ర ప్రసాద్ గారు స్వతహాగా “జాలీ గో గుడ్ మాన్”, గిరి గీసుకొని బ్రతక లేదు, ఆలా అని హద్దులు దాట లేదు,అయన జీవితాన్ని తనదయిన రీతిలో ఆస్వాదిస్తూనే, ఇటు మానవత్వం,అటు ఆధ్యాత్మిక కోణం కలిగిన విభిన్నమైన మనిషి రాజేంద్ర ప్రసాద్ గారు. వి.బి అంటే “విభిన్నమయిన రాజేంద్ర ప్రసాద్” అనే విధంగా జీవించారు “ఆ కర్మ జీవి”..!!